Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadInternational NewsJayashankar BhupalpallyKhammamLife StyleMahabubabadMuluguNational NewsPoliticsSpot NewsTelanganaYouth

నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి హామీలు

నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి హామీలు

రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి

✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు, ఫిబ్రవరి 9

తెలంగాణలో రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వాటితోపాటు 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంకావాలని సీఎం సూచించారు. గురువారం హైదరాబాదులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి సింగరేణి సంస్థలో ఎంపికైన 441మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32లక్షల మంది నిరుద్యోగుల్లో తిరిగి విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం 412 మందికి కారుణ్య నియామక పత్రాలు, 29 మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేశారు. వీరిలో బ‌దిలీ వ‌ర్క‌ర్లు, జూనియ‌ర్ అసిస్టెంట్లు, మోటారు మెకానిక్‌లు ఉన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా యువతకు నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా, కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని ఖాయిలా పడేలా చేసిందని, కేంద్ర ప్రభుత్వం కూడా సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం కాంగ్రెస్ కు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటు కోసం సహకరించిందని ముఖ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి ఉందని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో వున్న బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని సీఎం గుర్తు చేశారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇటివలే తాను ఆదేశించినట్లుగా సీఎం స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. కారుణ్య నియామకాల వయస్సు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్, కోవా లక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, ఐ.ఎన్.టి.యు.సి జనరల్ సెక్రటరీ జనప్రసాద్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేపు “నేషనల్ స్పోర్ట్స్ డే” వేడుకల్లో పాల్గొనండి: డీవైఎస్ఓ

Divitimedia

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్

Divitimedia

“తగ్గేదెలే…” మేడమ్ టుస్సాడ్స్ సెల్ఫీతో అల్లు అర్జున్ హంగామా

Divitimedia

Leave a Comment