అతుకులబొంతలు… అక్కడక్కడా వదిలేసిన గుంతలు…
ఇష్టారాజ్యంగా ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతులు
వృధా అవుతున్న నిర్వహణ నిధులు – తప్పని తిప్పలు
✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 12)
గుంతలతో ప్రాణాంతకంగా మారుతున్న ప్రయాణాలను కాస్త అనుకూలంగా మార్చేందుకు చేస్తున్న పనులు కూడా వృధాగా మారుతున్న దుస్థితి ఇది… గుంతలను పూడ్చే పనులు చేస్తున్న ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లకు, పర్యవేక్షించే అధికారులకు ఏమాత్రం శ్రద్ధ లేకపోవడంతో నామమాత్రం అవుతున్న పనులతో నిధులు దుర్వినియోగమవుతున్న పరిస్థితి నెలకొంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతు పనులు తూతూమంత్రంగా మారుతుండగా ప్రయాణికులు యధాతథంగా అవస్థలు పడుతున్నారు. బూర్గంపాడు మండలంలో ప్రస్తుతం జరిగే ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతులను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. బూర్గంపాడు మండల కేంద్రం నుంచి సారపాక, నెల్లిపాక రహదారిలో మరమ్మతు పనులు తూతూమంత్రంగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ రోడ్డు మీద ఏర్పడిన గోతులతో ప్రజలకు ప్రయాణం ప్రాణాంతకంగా మారడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, మరమ్మతులకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ఫలితంగా జరుగుతున్న పనులపై అధికారులు సక్రమంగా పర్యవేక్షించడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. రోడ్డుపైన అనేక ప్రాంతాల్లో ఏర్పడిన పెద్ద పెద్ద గోతులను మాత్రమే పూడ్చుకుంటూ వెళ్తున్న కాంట్రాక్టర్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న గోతులను వదిలేస్తున్నారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న గోతులతో ఎగిరెగిరి పడుతూ ప్రయాణించాల్సిన దుస్థితికి తోడు పెద్ద గోతులను పూడ్చిన అతుకులు వాహనాలకు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. అతుకులు, గుంతలతో ప్రయాణం మరింత ఘోరంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఆటోల వంటి చిన్న వాహనాలకు ఈ గోతులు, మరమ్మతుల కారణంగా వేసిన అతుకులు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పుడు చేస్తున్న మరమ్మతులతో బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ద్విచక్ర వాహనాలు, ఆటోలలాంటి చిన్న వాహనాలకు మరింతగా ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనికి తోడు చిన్నపాటి వర్షం కురిసినా, ఆ పూడ్చకుండా వదిలేసిన చిన్న గుంతల్లో నీరు నిలిచిపోయి, పెద్ద గోతులుగా మారుతున్నాయి. దీని వల్ల మళ్లీ వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో తూతూమంత్రపు పనులతో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం, అధికారులకు కమిషన్ల వర్షం కురుస్తుండగా, రోడ్ల నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారుల పర్యవేక్షణ పెంచి, నాణ్యతతో పనులు జరిగే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని సామాజికవేత్తలు, కార్యకర్తలు కోరుతున్నారు. ఈ పనుల నాణ్యత గురించి ‘దివిటీ మీడియా’ ప్రతినిధి ఆర్ అండ్ బి అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.