ఐటీడీఏల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు పకడ్బందీగా నిర్వహించాలి
అధికారులకు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశాలు
✍🏽 దివిటీ – భద్రాచలం, క్రీడావిభాగం (డిసెంబర్ 27)
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నాలుగు ఐటీడీఏల పరిధిలోని గిరిజన బాలబాలికల రాష్ట్రస్థాయి క్రీడాపోటీల విజయవంతానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏటీడీవోల సమావేశంలో జనవరి 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కిన్నెరసాని క్రీడాపాఠశాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలకు ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏల పరిధిలోని దాదాపు 2000 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్న, ఈ క్రీడాపోటీలలో క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కమిటీలు ఏర్పాటు చేసుకొని వారికి మంచి పుష్టికరమైన భోజనంతో పాటు వసతి కల్పించాలని, వివిధ రకాల క్రీడాపోటీలకు సంబంధించిన క్రీడాస్థలాలు వారికి అనుకూలంగా సిద్ధం చేయాలని కోరారు. క్రీడాస్థలాలకు ఏమైనా మరమ్మత్తులు అవసరముంటే వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ దృష్టికి తీసుకువెళ్లి చేయించుకోవాలని తెలిపారు. ఏమాత్రం అశ్రద్ధ వహించినా రాష్ట్రంలో చెడ్డపేరు వచ్చే అవకాశమున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు కల్పించాలని, సంబంధిత ఏటీడీవోలు, కమిటీ మెంబర్లు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. క్రీడాకారులతోపాటు వారి వెంట వచ్చే లైజన్ ఆఫీసర్లు, కోచ్ లు, పీడీలు, పీఈటీలకు సరిపడా వసతిసౌకర్యాలు కల్పించాలని, చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరికీ రగ్గులు, జంపఖానాలు, క్రీడాకారులకు ప్రత్యేక మెనూ ఏర్పాటు చేయాలన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీతో పాటు సంబంధిత పీడీలు పీఈటీలు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, ఏసీఎంఓ రమణయ్య, క్రీడల అధికారి బి.గోపాలరావు, ఏటీడీవోలు నర్సింగరావు, చంద్రమోహన్, జహీరుద్దీన్, రూపాదేవి, ఏఎస్ఓ వెంకటనారాయణ, నాగేశ్వరరావు, రాంబాబు, నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.