ప్రజలందరూ నిర్భయంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెం పోలీసుల ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న ఎస్పీ వినీత్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ప్రజలందరూ నిర్భయంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ కోరారు. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు మంగళవారం నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ఆయన పాల్గొన్నారు. ఈనెల(నవంబరు) 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ప్రజలందరూ హాజరై ఓటుహక్కు నిర్భయంగా వినియోగించుకునే విధంగా జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.వినీత్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రజలలో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మద్యం,నగదు, పలు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై తప్పక కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.