ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బరిలో నిలిచిన 253 నామినేషన్లు
నామినేషన్ల పరిశీలనలో 30 నామినేషన్ల తిరస్కరణ
✍🏽 దివిటీ మీడియా – ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 120మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత 16 నామినేషన్లు తిరస్కరించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పినపాక నియోజకవర్గంలో మొత్తం 25 నామినేషన్లు దాఖలు కాగా, 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇల్లందు నియోజకవర్గంలో 34నామినేషన్లు దాఖలు కాగా 4నామినేషన్లు, కొత్తగూడెం నియోజకవర్గంలో 36నామినేషన్లు దాఖలు కాగా 2నామినేషన్లు తిరస్కరించారు. అదే విధంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో మొత్తం 23నామినేషన్లు దాఖలు కాగా 2 నామినేషన్లు, భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 18నామినేషన్లు దాఖలు కాగా 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
—————–
ఖమ్మంజిల్లాలో 14 నామినేషన్ల తిరస్కరణ
—————–
నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖమ్మం జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో 133 నామినేషన్లు బరిలో మిగిలాయి. 5అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి.గౌతమ్ సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పాత్రికేయులతో మాట్లాడుతూ నామినేషన్ల స్క్రూటినీ వివరాలు వెల్లడించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 39 నామినేషన్లు దాఖలు కాగా 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పాలేరు నియోజకవర్గంలో 42 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మధిర నియోజకవర్గంలో 22 నామినేషన్లు దాఖలు కాగా 5 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వైరా నియోజకవర్గంలో 16 నామినేషన్లు దాఖలు కాగా 1 నామినేషన్, సత్తుపల్లి నియోజకవర్గంలో 28 నామినేషన్లు దాఖలు కాగా 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో చేపట్టిన స్క్రూటినీ(పరిశీలన) ప్రక్రియ పూర్తి చేశారు. కాగా ఈనెల(నవంబరు) 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఆ ఘట్టం కూడా పూర్తయిన తర్వాతనే ఏ నియోజకవర్గంలో ఎంతమంది పోటీలో ఉంటారనేది స్పష్టత రానుంది. నామినేషన్ ఉపసంహరణ దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉండాలని, అభ్యరి నేరుగా గాని, అభ్యర్థి ప్రతిపాదిత వ్యక్తి గానీ ఆ దరఖాస్తు అంద జేయవచ్చని ఖమ్మంజిల్లా ఎన్నికల అధికారి వి.పి.గౌతమ్ తెలిపారు. ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే అదేరోజు ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో గుర్తుల కేటాయింపు కూడా జరుగుతుందని ఆయన వెల్లడించారు.