ఉత్సాహం నింపిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, అందునా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ క్యాడర్ లో సీఎం కేసీఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఎన్నికల వేళ ఉత్సాహం నింపింది. ఎన్నికల ప్రచారం కోసం అవిశ్రాంతంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’ లలో భాగంగా సోమవారం (నవంబరు 13) బూర్గంపాడు, దమ్మపేట మండలాల్లో రెండు సభలు నిర్వహించారు. దమ్మపేటకు కాస్త భిన్నంగా బూర్గంపాడు మండలంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి భారీగానే హాజరైన ప్రజల నుంచి స్పందన రావడంతో ఆయన కూడా ఉత్సాహంగా మాట్లాడుతూ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి ఆకట్టుకున్నారు. తమ నియోజకవర్గంలో దళితబంధు పథకంపైన ఆశలు పెట్టుకున్న వారందరికీ ఒకేసారిగా సాయం అందజేయాలని రేగా కాంతారావు కోరడం, కేసీఆర్ ఇక్కడ ‘పైలెట్ ప్రాజెక్టు’గా ఒకేదఫాలో అర్హులందరికీ అందజేస్తామని ప్రకటించడంతో సభికుల నుంచి కేరింతలు వినిపించాయి. ప్రజలనుంచి మంచి స్పందన రావడంతో కేసీఆర్ తనదైన శైలిలో ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ నాయకుల వైఖరి పైన విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ ను ఎత్తివేస్తామనడం ద్వారా కాంగ్రెస్ నేతలు రైతులకు ‘రైతుబంధు’ అందకుండా చేసేలా ఉన్నారని, మళ్లీ అధికారులు, దళారులను పెత్తనం చేసే పరిస్థితి తెస్తారని హెచ్చరికలు చేశారు. దీంతో కేసీఆర్, రైతులలో కాంగ్రెస్ పార్టీపట్ల ఉన్న సానుకూలత తగ్గించేందుకు, బీఆర్ఎస్ పట్ల ఆకర్షించే ప్రయత్నం చేశారు. మణుగూరు బీటీపీఎస్ నిర్మాణం, 16వేల కుటుంబాలకు 57వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా వంటి సానుకూలమైన అంశాలను ప్రస్తావించారు. ఇలాంటి అంశాలతోనే ప్రజల్ల ఆలోచనలను రేకెత్తించిన సీఎం కేసీఆర్, తాము గతంలో చేసిన వాగ్దానంమేరకు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో కరకట్టలు నిర్మించడం, వరద బాధితుల కోసం ఇళ్లు నిర్మించడం, భద్రాద్రి అభివృద్ధికి కృషి వంటి హామీలు ఈసారి తప్పకుండా నెరవేర్చేలా మరోసారి భరోసా ఇచ్చారు. అయితే సభకు హాజరైన సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ‘భద్రాద్రి రాముడి’ ప్రతిమను బహూకరించేందుకు ప్రయత్నం చేయడం, ఆయన తిరస్కరించడం సర్వత్రా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. భద్రాచలం ప్రాంత అభివృద్ధికి, రామాలయం అభివృద్ధి కోసం గతంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం, భద్రాద్రి రాముడి దర్శనం కోసం సీఎం కేసీఆర్ ఆసక్తి చూపకపోవడం వంటివి విమర్శలకు దారితీస్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ మరో ప్రచారాస్త్రాన్ని అందించినట్లయింది. ఈ వ్యవహారం మళ్లీ ఎంత దుమారం లేపుతుందనేది ఆసక్తికర అంశంగా మారింది.