విలువిద్య పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైన మమత
✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఇఎంఆర్ఎస్) విద్యార్ధిని సనప మమత విలువిద్య(ఆర్చరీ)లో జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈనెల 10నుంచి 12వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో అండర్-14 బాలికల విభాగంలో రజత పతకం సాధించిన మమత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యక్తిగత పోటీలలో దక్కిన మొట్టమొదటి పతకం సాధించిన ఆమెను, ఆమెకు తగిన శిక్షణ ఇచ్చిన కోచ్ ప్రసాద్ ను ఉమ్మడి జిల్లాల విద్యాశాఖాధికారులు
ఇ.సోమశేఖరశర్మ, ఎం.వెంకటేశ్వరాచారి అభినందించారు. త్వరలో జరగబోతున్న జాతీయస్థాయి విలువిద్యపోటీల్లో మమత తన ఉత్తమ ప్రదర్శనతో మరిన్ని పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లాల పాఠశాలల క్రీడా కార్యదర్శులు స్టెల్లా ప్రేమ్ కుమార్, కె నర్సింహమూర్తి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.