ఏపీలో ఘోర రైలు ప్రమాదం, పదిమంది దుర్మరణం
✍🏽 దివిటీ మీడియా – విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పదిమంది దుర్మరణం చెందగా, మరో 40మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు చెప్తున్న వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా లోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ వద్ద రెండు రైళ్లు ఆదివారం రాత్రి ఢీకొన్నాయి. ఆగి ఉన్న రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి పలాస రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సిగ్నల్ కోసం ఆగిన సమయంలో విశాఖపట్నం- రాయగడ ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ లోని మూడు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడి పోయాయి. ఈ ప్రమాదంలో బుధవారం తెల్లవారుజాము వరకు పదిమంది మృతి చెందారు. దాదాపు మరో 40 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రైలు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. ఈ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి మోడీ రైల్వేశాఖ మంత్రి అశ్వనివైష్ణవ్‌తో మాట్లాడి, సహాయక చర్యలకు ఆదేశించారు. ఈ రైలు ప్రమాదం గురించి ఏపీ సీఎం జగన్‌తో రైల్వే శాఖమంత్రి అశ్వనివైష్ణవ్ మాట్లాడారు. రైలు ప్రమాదఘటనస్థలంలో ఏపీ ప్రభుత్వం భారీ సంఖ్యలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టింది. సీఎం జగన్ ఆదేశాలతో మంత్రి బొత్స సత్యనారాయణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్షత గాత్రులకు మెరుగైనచికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు వివరాలు, సాయం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.