మూడు దశాబ్దాల తర్వాత కలిసిన ఆనాటి సహ విద్యార్థులు
లిటిల్ ఫ్లవర్స్ విద్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న ఆనాటి సహ విద్యార్థులు ఒకచోట చేరారు. ఆనాడు తాము కలిసి చదువుకున్నప్పటి సంగతులు, సరదాలు, భావోద్వేగాలు గుర్తు చేసుకున్నారు. తమ చిన్ననాటి నేస్తాలలో ప్రస్తుతం ఎవరెవరు ఏమేంచేస్తున్నారో, వారి జీవనస్థితిగతులెలా ఉన్నాయో పరస్పరం చర్చించుకున్నారు. కష్టసుఖాలు పంచుకునే ప్రయత్నం చేశారు. భద్రాచలంలోని లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో 1984-85 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం(అక్టోబరు 22వతేదీ) ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ ఆత్మీయ కలయికకు అక్షయ కన్వెన్షన్ హాల్ వేదికైంది. ఈ సoదర్భంగా ఆనాటి పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల తర్వాత తామంతా ఒకచోట కలుసుకోవడం మించిన ఆనందం ఇంకొకటి లేదన్నారు. ఆ రోజుల్లో స్కూల్లో చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఆ మధుర అనుభూతులే వేరంటూ ఆనందబాష్పాలు వర్షిస్తూ, తమ అనుభూతిని మిత్రులతో పంచుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులైన బి.నాగేశ్వరరావు (బీఎన్ఆర్), నేటి బ్రిల్లియంట్ విద్యాసంస్థల చైర్మన్, ఉపాధ్యాయుడు స్వామిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి, తమలో కృతజ్ఞతను తెలియజేశారు. కార్యక్రమంలో కె.స్వాతి, ఎం.కిరణ్, ఎన్.శ్రీను, దీపక్ పాండే, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.