Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamNalgondaPoliticsTelangana

కొలిక్కిరాని ‘కాంగ్రెస్- కామ్రేడ్ల’ సీట్ల సర్దుబాటు

కొలిక్కిరాని ‘కాంగ్రెస్- కామ్రేడ్ల’ సీట్ల సర్దుబాటు

షెడ్యూల్ వెలువడి రోజులు గడుస్తున్నా పూర్తికాని సర్దుబాట్లు

కాంగ్రెస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో కాస్త స్పష్టత

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై రోజులు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్, వామపక్షాల నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి రావట్లేదు. ఎన్నికల సమరంలో వామపక్షాలతో కలిసి, బీఆర్ఎస్ పార్టీ మీద నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు సీట్ల సర్దుబాటుకు కసరత్తు ముమ్మరమైంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు స్థానాల్లోను పోటీకి అవకాశం కల్పించినట్లు చెప్తున్నారు. ఓవైపు సర్దుబాటు చర్చలు సాగుతుండగానే తమ పార్టీ తరపున 55స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ జాబితా పరిశీలిస్తే సీట్ల సర్దుబాటు కావడం కోసం చర్చల్లో నలుగుతున్న మరికొన్ని సీట్ల అభ్యర్థులను ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చర్చలలో సానుకూల వాతావరణం కల్పించినట్లు అర్థమవుతోంది. వామపక్షాల పొత్తుల విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్లగొండజిల్లా కీలకంగా మారడంతో ఇక్కడ సీట్లు సర్దుబాటు చేసుకునేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. పొత్తుల్లో సీపీఐ కోరిన కొత్తగూడెం, మునుగోడు స్థానాలకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ, ఈ విషయంలో సీపీఎం అడుగుతున్న స్థానాల్లో ఇబ్బందులు అధిగమించేందుకు మరికొంచెం సమయం పడుతుందంటున్నారు. సీపీఎం తమకు పాలేరు, భద్రాచలం కేటాయించేలా వత్తిడిచేసినప్పటికీ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. పాలేరులో కాంగ్రెస్ లో కీలకనేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను ప్రచారంలోకి దిగాలని సాక్షాత్తూ రాహుల్ గాంధీ సూచన చేయడంతో సీపీఎంకు పాలేరు సీటు కూడా కష్టంగా మారింది. భద్రాచలంలోనూ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య బరిలోకి దిగడం ఖాయమైపోయిన విషయం తెలిసిందే. మిర్యాలగూడ సీటుపై కూడా ఇబ్బందులేమీ లేకపోయినప్పటికీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఏదో ఒక సీటు తమ పార్టీకి కేటాయించాల్సిందేనని సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్లనే ఉమ్మడి ఖమ్మంజిల్లా పరిధి లోనిదే అయిన వైరా సీటు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందుకొచ్చిందని విశ్వసనీయ సమాచారం. అయితే రిజర్వ్డ్ స్థానమైన వైరాను తీసుకునేందుకు సీపీఎం ముందుకు వస్తుందో, లేదో అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. సీట్లసర్దుబాటులో తేడా వస్తే ఒంటరిగానైనా పోటీ చేస్తామని సీపీఎం నాయకులు వ్యూహాత్మకంగా చెప్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించి రోజులు గడుస్తున్న నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారం సాధ్యమైనంత త్వరగా తేల్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. తొలి జాబితాలో పేర్లు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆశావహులకు, వామపక్షాల పొత్తు వ్యవహారాన్ని సాకుగా చూపిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం, ఏదో ఒకటి త్వరగా తేల్చుకునే పనిలో పడింది. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్, ఎన్నికలపొత్తుల అంశంలో తమను తిరస్కరించిందనే ఉక్రోషంలో ఉన్న వామపక్షాలకు పొత్తుల్లో మిగిలి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేననే విషయం కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లోనే కాస్త అటూఇటు అయినా పొత్తులు మాత్రం ఖాయమేనని కాంగ్రెస్, వామపక్షాల నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం సీపీఎం నాయకులు తమకు కేటాయించే స్థానాల విషయంలో కాస్త మెట్టుదిగడమో, ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడమో తేల్చుకోవాల్సి వస్తోంది. ఓవైపు ముందుగానే అభ్యర్థుల జాబితాలో స్పష్టంగా పేర్లు ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తాజాగా సోమవారం మేనిఫెస్టోను కూడా ప్రకటించి, బీఫామ్స్ కూడా పంపిణీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు, ఇతరులు మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెల్లడి తర్వాత కూడా పొత్తుల చర్చల్లో నిమగ్నమై ఉండటంతో ఈసారి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అస్తికరంగా మారాయి..

Related posts

కోరం కనకయ్యను సన్మానించిన జడ్పీ అధికారులు, సిబ్బంది

Divitimedia

రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు

Divitimedia

విధులకు ‘డుమ్మాకొట్టి’… పైరవీల బాట పట్టి…

Divitimedia

Leave a Comment