పారదర్శకమైన, నకిలీ ఓట్లు లేని ఓటరు జాబితా రూపొందించాలి
రోల్ అబ్జర్వర్ బాల మాయాదేవి
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
పారదర్శకమైన, నకిలీ ఓట్లు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోల్ అబ్జర్వర్ బాల మాయాదేవి కోరారు. మంగళవారం ఆమె ఐడీఓసీలోని సమావేశమందిరంలో ఓటరు జాబితా రూపకల్పనపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, స్వీప్ నోడల్ అధికారి, తహశీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు జాబితా చాలా కీలకమన్నారు. జిల్లాలో 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన 21,194 మంది నూతన ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. యువతీ, యువకులు నూతన ఓటరుగా నమోదుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక చేపట్టిన కార్యక్రమాలను ఆమె అభినందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలనే ద్యేయంతో కళాశాలల్లో పెద్దఎత్తున స్వీప్ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. అర్హులైన యువత ఓటర్ హెల్ప్ లైన్, ఎన్. వి.ఎస్.పి. పోర్టల్ ద్వారా ఓటు నమోదు
చేసుకోవాలని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం రూపొందిస్తున్న ఓటరుజాబితాలో ఈ అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులను ఓటరుగా నమోదు చేయాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా అధికంగా ఓటరు నమోదుచేసిన పోలింగ్ కేంద్రాలు, అధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన పోలింగ్ కేంద్రాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. తొలగింపు ప్రక్రియ రికార్డులు తనిఖీ చేసిన ఆమె సంతృప్తి వ్యక్తంచేస్తూ అధికారులను అభినందించారు. ఓటరుజాబితాలో జరిగిన మార్పులపై మరోసారి సమీక్షించాలని రోల్ అబ్జర్వర్ సూచించారు. జిల్లా పరిధిలో ప్రజా ప్రతినిధులు, వివిధరంగాల ప్రముఖుల ఓట్ల వివరాలు ఓటర్ల జాబితాలో ఉన్నాయో, లేవో మరోసారి పరిశీలించాలని తెలిపారు.
ఓటర్లకు తప్పనిసరిగా ఓటరు గుర్తింపుకార్డు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 15 నాటికి ఓటరు జాబితాలో నమోదై ఉన్న ఓటర్లకు గుర్తింపు కార్డులు అందించాలన్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా జనాభా నిష్పత్తి ఆధారంగా ఓటరు జాబితా రూపకల్పన కార్యక్రమం చేపట్టామన్నారు. ఆగస్టు 21న ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం
జిల్లాలో 9,28,983 మంది ఓటర్ల నమోదు జరిగిందని చెప్పారు. ఫారం- 6,7,8 లకు 68,703 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటివరకు 50,659 దరఖాస్తుల విచారణ పక్రియ పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన 18,044 దరఖాస్తులపై విచారణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికలకు 1095పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుజాబితా రూపకల్పన పర్యవేక్షణకు బూత్ స్థాయి అధికారులను ఏర్పాటు చేశామన్నారు. బూత్ స్థాయిలో అధికారులు, సూపర్వైజర్లను నియమించి ఓటరుజాబితా పకడ్బందీగా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
దివ్యాంగులను పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేశామని, జిల్లా పరిధిలోని ప్రతి కళాశాలలో ప్రత్యేకంగా స్వీప్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో పినపాక, అశ్వారావుపేట కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, కాశయ్య, మంగిలాల్, స్వీప్ నోడల్ అధికారి మధుసూదన్ రాజు, డీఆర్ఓ రవీంద్రనాధ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ప్రసాద్, రంగప్రసాద్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.