ఉపాధిహామీ పథకంలో అవినీతిపై ప్రశ్నించిన జడ్పీ సభ్యులు
నీటి సరఫరాలో ఇబ్బందులపైనా గళమెఖత్తిన సభ్యులు
జిల్లా కలెక్టర్ హాజరు కావడంతో సభ్యుల్లో ఆనందం
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
జిల్లాలో ఉపాధిహామీ పథకంలో అవినీతి
పట్ల విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. నీటి సరఫరా సక్రమంగా చేయాల్సి ఉన్న మిషన్ భగీరథ పథకంలో సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం (సెప్టెంబర్ 5వ తేదీ) మంగళవారం ఛైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో గిరిజనులకు ఇంటినెంబర్ల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని జడ్పీ ఛైర్మన్ కనకయ్య తెలిపారు. వ్యవసాయం, మిషన్ భగీరథ, జాతీయ ఉపాధిహామీపథకం, బిసి, మైనార్టీ సంక్షేమశాఖలు, అటవీ, వైద్య, పంచాయతీ రాజ్ శాఖలపై ఈ సర్వసభ్య సమావేశంలో చర్చించారు. కోరం కనకయ్య మాట్లాడుతూ మంచినీటి సరఫరాపై గ్రామ పంచాయతీల ద్వారా ప్రస్తుతం పర్యవేక్షణ చేస్తున్నామని, నిర్వహణ బాధ్యతలు ఏజన్సీలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మిషన్ బగీరథ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయ లోపం వల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఇంటి నెంబర్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. పోడు పట్టాలు రాలేదని సభ్యులు తెలిపిన వివరాల మేరకు విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించిన అంశాలపై లోతుగా విశ్లేషించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తీసుకున్న చర్యలపై సభ్యులకు నివేదికల ప్రతులను అందజేయాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు గ్రామస్థాయి సమస్యలు తెలుస్తాయని,ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ ఇస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ పోడు భూములకు పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులు విచారణ చేస్తామని చెప్పారు. సర్వే జరిగినా పట్టాలు రానివారి వివరాలను జిల్లాస్థాయి కమిటిలో ఆమోదించారా? తిరస్కరించారా? అన్న అంశాలను పరిశీలన చేస్తామని చెప్పారు. పోడుపట్టాల జారీలో అటవీ గెజిట్లను పరిశీలన చేస్తామన్నారు. ఉపాధిహామీ పథకం పనులకు రాని వ్యక్తులకు నిధులు చెల్లింపులు జరిగాయని, సభ్యులు చెప్పగా, ఆ వివరాలను లిఖితపూర్వకంగా అందజేస్తే విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆళ్లపల్లి మండలం కస్తూర్బాగాంధీ పాఠశాలలకు ప్రహరీ మంజూరు చేయాలని కోరగా ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చండ్రుగొండ మండలంలో మిషన్ భగీరథ మంచినీటి సమస్య తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీటి ట్యాపులు పీకేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుని, అలాంటి ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా నిలిపివేతకు కూడా పంచాయితీ ద్వారా తీర్మానాలు చేయాలని చెప్పారు. తొలిసారి జడ్పీ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరు కావడం, సమస్యలపై స్పందించడంతో సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅలను సభ్యులు సత్కరించారు. సర్వసభ్య సమావేశంలో గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్, జడ్పీ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్రావు, స్థానికసంస్థల అదనపుకలెక్టర్ మధుసూదన్ రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.