“డయల్ యువర్ ఎస్పీ”లో సమస్యలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ డా.వినీత్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ మంగళవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వయంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మొత్తం 17 మంది భాదితులు తమ సమస్యలు, ఫిర్యాదులు తెలుపుకోవడానికి ఫోన్ ద్వారా ఎస్పీని సంప్రదించారు. భూమి తగాదాలకు సంబంధించి 4, వ్యక్తిగతమైన విషయాలకు సంబంధించి 9, సాధారణ సమస్యలు 3, చీటింగ్ కేసులకు సంభందించి 1 ఫిర్యాదు, సమస్యలను ఎస్పీ తెలుసుకున్నారు. వాటి పరిష్కారంకోసం వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కూడా తమ సమస్యలు తెలుపుకోలేకపోయినవారు నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదు, సమస్య తెలుపుకోవచ్చని ఎస్పీ డా.వినీత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.
—————————–
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి పరిహారం అందజేసిన జిల్లా ఎస్పీ డా.వినీత్
—————————–
కొత్తగూడెం టూ టౌన్ పోలీసుస్టేషనులో విధులు నిర్వర్తిస్తూ గత మే నెలలో గుండె పోటు వల్ల మరణించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబానికి మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిహారం అంద జేశారు. తన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ రూ.8లక్షల చెక్కును అందజేశారు. భద్రతా విభాగం నుంచి ఈ పరిహారాన్ని మృతుని కుటుంబానికి అందజేసినట్లు ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. పోలీసుశాఖలో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి(ఏఓ) జయరాజు, కార్యాలయ సూపరింటెండెంట్ సత్యవతి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు యాకోబు, తదితరులు పాల్గొన్నారు.