జెన్కో సీఎండీ సంతకం ఫోర్జరీ చేసిన ఐటీసీ ఎంప్లాయ్
✍🏽 దివిటీ మీడియా – సారపాక
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ యువకుడితో రూ.10లక్షలకు బేరం సెటిల్ చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ఏకంగా తెలంగాణ విద్యుత్తు సంస్థల సీఎండీ ప్రభాకరరావు సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. ఆయన నకిలీ సంతకంతో ఉద్యోగ నియామకపత్రం కూడా అందించడంతో దొరికిపోయాడు. ‘దివిటీ మీడియా’కు అందిన సమాచారం మేరకు ఆ వివరాలిలా ఉన్నాయి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీ పేపర్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేసే మండపాటి రాజశేఖర్ కు ఎలక్ట్రీషియన్ గా ఉద్యోగం ఇప్పిస్తానని అదే సంస్థలో ఎంప్లాయిగా పని చేస్తున్న ప్రవీణ్ అనే వ్యక్తి నమ్మబలికాడు. విద్యుత్తుసౌధలో తనకు తెలిసినవారెంతో మంది ఉన్నారని నమ్మించాడు. ఉద్యోగం ఇప్పించినందుకు తనకు రూ.10లక్షలు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాతే తాను ఒప్పందం ప్రకారం డబ్బు ఇస్తానని రాజశేఖర్ చెప్పడంతో జెన్కో సీఎండీ డి. ప్రభాకరరావు సంతకంతో అప్పాయింట్మెంట్ లెటర్ కాపీని రాజశేఖర్ కు వాట్సాప్ ద్వారా పంపించిన ప్రవీణ్, ఒప్పందం ప్రకారం తన డబ్బు వెంటనే ఇవ్వాలని డిమాండ్ కూడా చేశాడు. ఈ పరిస్థితుల్లో ఆ లెటర్ గురించి నమ్మకం కుదరకపోవడం వల్ల రాజశేఖర్, ఆ కాపీని కూకట్ పల్లిలో తనకు పరిచయం ఉన్న ఎన్.సురేంద్రకుమార్ కు పంపించారు. ఖైరతాబాద్ లోని విద్యుత్తు సౌధకు వెళ్లిన సురేంద్రకుమార్ ఆరా తీశారు. దీంతో ఈ అప్పాయింట్మెంట్ లెటర్ వ్యవహారం టీఎస్ జెన్కో విజిలెన్స్ విభాగానికి చేరింది. దానిపై విచారించిన విజిలెన్స్ అధికారులు సీఎండీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు వారు ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రవీణ్ పై ఫోర్జరీతో సహా చీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో ఐటీసీ పీఎస్ పీడీ సంస్థలో పని చేసే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నిందితుడిగాను, మరొకరు బాధితుడిగా ఉండటంతో ఈ వ్యవహారం సారపాక, భద్రాచలం ప్రాంతంలో తీవ్రమైన సంచలనం సృష్టించింది.
————————————-
నోటిఫికేషన్ ద్వారానే ఉద్యోగాలు
———————————————
ఏ ఉద్యోగమైనా సంబంధితశాఖ నుంచి వెలువడే నోటిఫికేషన్ ద్వారానే వస్తుందని తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు, అర్హతల ఆధారంగానే అభ్యర్థులు ఎంపికవుతారని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ఖాళీలులేవని, తప్పుడు ప్రచారం నమ్మవద్దని, ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెప్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.