అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమావేశం
ఐటీసీలో చర్చించిన మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు మంగళవారం ప్రత్యేకసమావేశం నిర్వహించారు. సారపాక ఐటీసీ అతిథిగృహంలో జరిగిన సమావేశం సరిహద్దుల్లో పలుఅంశాల్లో సమన్వయంతో ముందుకు సాగడం కోసం నిర్వహించినట్లు చెప్తున్నారు. మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక సమన్వయ ప్రణాళిక రూపొందించడానికి ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకనిఘా ఏర్పాట్లు, ఎన్నికల సమయంలో మద్యం, నగదు సరఫరా అడ్డు కోవడం, నియంత్రించడంకోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. సరిహద్దులలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తర్వాత విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఆల, సుకుమా జిల్లా కలెక్టర్ హరీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పి.కరుణాకర్, భద్రాచలం ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.
