హాస్టల్ సమస్యలు చూసి ఆగ్రహించిన కలెక్టర్
ఆకస్మిక తనిఖీలో అధికారులకు కలెక్టర్ ప్రియాంక వార్నింగ్
✍🏽 దివిటీ మీడియా – పాల్వంచ
“మీ పిల్లలను, మీ ఇంటిని ఇలాగే అపరిశుభ్రంగా ఉంచుతారా? పిల్లలకు ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదు, బెడ్స్ ఇవ్వలేదు, హాస్టల్ అపరిశుభ్రంగా ఉంది… ఇలా ఉంటే పిల్లలు ఏవిధంగా చదువుకుంటారు?” అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఎస్సీ అభివృద్ధి శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్వంచ పట్టణం అంబేద్కర్ సెంటర్లోని షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ బాలుర వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వంటగది, విద్యార్థుల రూములు పరిశీలించి వారికి ఎలాంటి ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మెనూ ప్రకారం ఆహారం ఇస్తున్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు కలెక్టర్ ఆ హాస్టల్ వంటగది స్వయంగా పరిశీలించారు. ‘రూములకు వైట్ వాష్ లేదు, ఎక్కడి బూజు అక్కడే ఉంది, వంటగదిలో అపరిశుభ్రంగా ఉంది, అక్కడే వంట సామాగ్రి, ప్రక్కనే చెత్త ఉంటే ఏం చేస్తున్నారు?’ అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. పాచ్ వర్కులున్నాయి… ఏంటి ఈ దుస్థితి? అంటూ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖాధికారికి అక్కడికక్కడే ఫోన్ చేశారు. విద్యార్థులకు ఏఏ సామాగ్రి ఇస్తున్నారనేది తనకు తక్షణమే నివేదిక అందచేయాలని ఆదేశించారు. రిజిష్టర్లో నమోదుల ప్రకారం విద్యార్థులు లేకపోవడంతో, ఎందుకు తేడా వస్తున్నదని ఆ హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ తరగతి చదువుతున్న కిషోర్ అనే విద్యార్థి అక్కడే ఉండటంతో బడికెందుకు వెళ్లలేదని తెలుసుకున్నారు. తనకు జ్వరం వస్తోందని, అందుకే బడికి వెళ్లలేదని ఆ విద్యార్థి చెప్పడంతో ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తున్నదని కలెక్టర్ ప్రశ్నించారు. ఆసుపత్రిలో చూపించారా? లేదా? మందులు వేసుకున్నావా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. మందులేమీ ఇవ్వకపోతే తనకు చెప్పాలని అడుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని ఆ విద్యార్థికి సూచించారు. వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఆ హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు క్రమం తప్పక ఆరోగ్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ హాస్టల్ నిర్వహణ తీరు అస్సలు బాగాలేదని, ఇదే ‘లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్’ అంటూ కలెక్టర్ వార్డెన్ ను హెచ్చరించారు. మళ్లీ మరోసారి తాను పరిశీలనకొస్తానని, మంచిగా మార్పు కనబడకుంటే చర్యలు తీసుకుంటానంటూ కూడా కలెక్టర్ డా.ప్రియాంక హెచ్చరించారు. స్థానికంగా ఎందుకు ఉండటంలేదనిదానిపై వార్డెన్ ను ప్రశ్నించిన కలెక్టర్ ఎవరు వచ్చి చూసినప్పుడైనా ఎందుకు అందుబాటులో ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్ వాష్ వేయించినట్లు చెప్తున్నప్పటికీ ఆ దాఖలాలే లేవంటూ వార్డెన్ ను నిలదీశారు. బయట గోడలకు వైట్ వాష్ వేయించామని వార్డెన్ చెప్పడంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్, బయట వేస్తే లాభమేంటని నిలదీసి, విద్యార్థులుండే గదులలో వేయించాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలో జిల్లాకలెక్టర్ వెంట నాయబ్ తహసిల్దార్ వినయశీల, తదితరులు కూడా పాల్గొన్నారు.