ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎస్పీ
చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో జిల్లా ఎస్పీ విస్తృత పర్యటన
దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
వలస ఆదివాసీ ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడమే జిల్లా పోలీసుల లక్ష్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ తెలిపారు. చర్ల,దుమ్ముగూడెం పోలీసు స్టేషన్ల పరిధిలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ కూడా పాల్గొన్నారు. చర్ల మండలం బూరుగుపాడు గుత్తికోయ గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. 50 కుటుంబాలకు చెందిన గ్రామస్తులు, చిన్న పిల్లలు, వృద్ధులకు వైద్యపరీక్షలు చేశారు. భద్రాచలం, చర్లకు చెందిన ప్రత్యేక వైద్య బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. అనంతరం చర్ల-పూసుగుప్ప రహదారి మధ్యలో వరదల వల్ల కొట్టుకుని పోయి ప్రజల రాకపోకలకు అంతరాయంగా మారిన రహదారిలో కేంద్రప్రభుత్వ నిధులు వెచ్చించి నిర్మించిన నాలుగు బ్రిడ్జిలను ఎస్పీ ప్రారంభించారు. ఇక నుంచి పూసుగుప్పకు చెందిన ప్రజలకు చర్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈసందర్భంగా ఎస్పీ తెలిపారు. తర్వాత ఉంజుపల్లి సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు శంకుస్థాపన చేసి, ఉంజుపల్లి గ్రామస్తులకు రూ3.20లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఒక గానుగ నూనె మిల్లును అందజేశారు. చర్ల లెనిన్ కాలనీలో మండల యువతకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన భూమిని స్థానిక అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. అనంతరం దుమ్ముగూడెం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు కూడా పరిశీలించి అక్కడ అధికారులకు పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమాలనుద్దేశించి ఎస్పీ డా.వినీత్ మాట్లాడుతూ, జిల్లాలోని వలస అదీవాసీల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషిచేస్తుందన్నారు. వారికి కనీస సౌకర్యాల అందించడమే జిల్లా పోలీసుల ప్రధానమైన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాలలో చర్ల సీఐ రాజగోపాల్, దుమ్ముగూడెం సీఐ రమేష్, సీఐలు అశోక్, రాజువర్మ, ఎస్సైలు టి.వి.ఆర్ సూరి, నర్సిరెడ్డి, కేశవ్, సిబ్బంది పాల్గొన్నారు.